team india: చరిత్ర సృష్టించిన టీమిండియా..
ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం... 3-1తో సిరీస్ వశం చేసుకున్న మహిళల జట్టు;
భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇంగ్లీష్ జట్టును సొంత గడ్డపై ఓడించి సిరీస్ దక్కించుకుంది. ఇంగ్లండ్‌లో టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను టీమిండియా మహిళల జట్టు గెలవడం ఇదే తొలిసారి. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఈ విజయం చాలా సంవత్సరాలు గుర్తుంటుంది.
నాలుగో టీ20లో..
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టు ఇంగ్లాండ్‌పై 3-1 తేడాతో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో నాలుగో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. భారత బౌలర్ల ధాటికి 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులుచేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ 22 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, శ్రీచరణి 2 వికెట్లు, అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 17 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31), జెమీమా రోడ్రిగ్స్ (24*), హర్మన్ ప్రీత్ కౌర్ (26) రాణించారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన రాధా యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ లభించింది. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది రాధా. మొదటి రెండు టీ20లలో ఇంగ్లండ్ జట్టును ఓడించిన టీమిండియా.. మూడో టీ2లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. నాలుగో మ్యాచ్‌లో భారత మహిళలు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉంది.