TEST: తొలిరోజే పట్టు బిగించిన టీమిండియా
విండీస్‌ను వణికించిన సిరాజ్, బుమ్రా.. సిరాజ్ 4, బుమ్రా 3, కుల్ దీప్ 2 వికెట్లు.. 162 పరుగులకే కుప్పకూలిన కరేబియన్లు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా జోడీ విండీస్ బ్యాటర్లను వణికించింది. మొత్తంగా బుమ్రా 3, సిరాజ్ 4, కుల్దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.
విండీస్ పటపటా...
.తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. స్వల్ప వ్యవధిలోనే వెస్టిండీస్ ఓపెనర్లు త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్(0), జాన్ క్యాంప్‌బెల్(8) తమ వికెట్లు కోల్పోయారు. తర్వాత కూడా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో కేవలం 169 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్ (32, 48 బంతుల్లో, 4 ఫోర్లు), షై హోప్ 26, 36 బంతుల్లో, 3 ఫోర్లు), రోస్టన్ చేజ్ (24, 43 బంతుల్లో, 4 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ విజృంభించాడు. ఓపెనర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను ఔట్ చేసి.. భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. మొత్తంమీద అతడు తన ఖాతాలో 4 వికెట్లు వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీసుకున్నారు. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో విఫలమైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్థ శతకం కూడా సాధించలేకపోయారు.
నిలబడ్డ రాహుల్
టీమ్ఇండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ఇప్పటికింకా టీమ్ఇండియా 41 పరుగుల వెనకంజలో ఉంది. మొత్తానికి తొలి రోజు టీమ్ఇండియా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇన్నింగ్స్ మధ్యలో వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. వాన ఆగిన తర్వాత కొన్ని నిమిషాల అనంతరం తిరిగి ఆట ప్రారంభమైంది. యశస్వి జైస్వాల్ (36; 54 బంతుల్లో, 7 ఫోర్లు) తనకు లభించిన ఆరంభాన్ని పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. సాయి సుదర్శన్ (7; 19 బంతుల్లో) విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 20వ హాఫ్‌సెంచరీ. ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ (53; 114 బంతుల్లో, 6 ఫోర్లు) , శుభ్‌మన్ గిల్ (18, 42 బంతుల్లో, 1 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్, రోస్టన్ చేజ్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచులో సిరాజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా సిరాజ్ నిలిచాడు.