India Vs Pakistan : క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక యుద్ధం..ఒక్క మ్యాచ్..రూ.1600 కోట్ల ఆదాయం.

Update: 2026-02-16 05:44 GMT

India Vs Pakistan : క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు.. ప్రపంచమంతా ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య గెలుపోటముల పోరాటం మాత్రమే కాదు, కోట్ల మంది అభిమానుల భావోద్వేగాల ప్రవాహం. అయితే ఈ ఉత్కంఠ వెనుక నోట్ల కట్టల కొండ ఒకటి దాగి ఉంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఈ దాయాదుల పోరుపై నెలకొన్న సస్పెన్స్ వీడటంతో, అసలు ఈ ఒక్క మ్యాచ్‌పై ఎంత వ్యాపారం జరిగిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకటించకముందు ఒక వింత పరిస్థితి కనిపించింది. తొలుత పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు కాస్త అటూ ఇటూగా వ్యవహరించడంతో స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే టోర్నమెంట్ కళ తప్పడమే కాదు, ఆదాయం కూడా భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డుల చర్చల తర్వాత పాక్ ఎట్టకేలకు ఆడేందుకు అంగీకరించింది. మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించి పాకిస్తాన్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ పూర్తి కావడంతో హోటల్ ఇండస్ట్రీ నుంచి టీవీ ఛానళ్ల వరకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఒక్క మ్యాచ్ విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి దాదాపు 174 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.1560 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లుతుంది. అదే ఈ మ్యాచ్ సజావుగా జరిగితే దాదాపు 180 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.1600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అందుకే ప్రపంచ క్రికెట్‌లో ఈ మ్యాచ్‌ను బంగారు గుడ్లు పెట్టే బాతుగా భావిస్తారు. మొత్తం టోర్నీలో వచ్చే లాభాల్లో ఈ ఒక్క మ్యాచ్ వాటానే సింహభాగం.

మ్యాచ్ ఖరారైందో లేదో.. ఫ్యాన్స్ లో క్రేజ్ మామూలుగా లేదు. సాధారణంగా ముంబై నుంచి కొలంబోకు విమాన టికెట్ ధర రూ. 10 వేలు ఉంటే, అది ఒక్కసారిగా రూ.60 వేలకు చేరింది. అంటే దాదాపు 6 రెట్లు పెరిగిందన్నమాట. ఇక హోటల్ గదుల అద్దెలు అయితే ఏకంగా రూ.లక్ష దాటేశాయి. అయినా సరే, తమ అభిమాన జట్లు తలపడటం చూడటం కోసం ఫ్యాన్స్ ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. 2023 వరల్డ్ కప్ సమయంలో అహ్మదాబాద్‌లో కనిపించిన దృశ్యాలే మళ్ళీ ఇప్పుడు రిపీట్ కాబోతున్నాయి.

ముందు కాస్త మంకుపట్టు పట్టిన పాకిస్థాన్, తర్వాత దారిలోకి రావడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. ఐసీసీ నుంచి వచ్చే నిధులతోనే పాక్ క్రికెట్ బోర్డు మనుగడ సాగిస్తోంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానా పడటంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అన్నింటికీ మించి ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 90 శాతం వాటా భారత్ నుంచే వస్తుంది. బ్రాడ్ కాస్టర్లతో ఉన్న ఒప్పందాల ప్రకారం ఈ మ్యాచ్ ఆడటం పాకిస్థాన్‌కు అనివార్యం. అందుకే గర్వాన్ని పక్కన పెట్టి పాక్ మైదానంలోకి దిగేందుకు సై అంది.

Tags:    

Similar News