IND vs ENG : రెండో రోజు ముగిసిన ఆట.. దంచికొట్టిన భారత్.. ఇంగ్లాండ్ స్కోర్ ఎంతంటే..?

Update: 2025-07-04 09:00 GMT

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. రెండవ రోజు భారత్ అదరగొట్టింది. మొదటి ఇన్నింగ్స్‌ను 587 పరుగుల వద్ద ముగించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 77 రన్స్ చేసింది. హ్యారీ బ్రూక్, జో రూట్ నాల్గవ వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇంకా భారత్ కంటే 510 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉండగా, భారతదేశం తరపున ఆకాష్ దీప్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశారు.

భారత్ 587 పరుగులకు ఆలౌట్

అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 587 పరుగుల వద్ద ముగించింది. కెప్టెన్ గిల్ 269 పరుగులు చేశాడు. గిల్ కాకుండా, రవీంద్ర జడేజా, ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్‌లు ఇంగ్లాండ్‌పై భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలకమయ్యాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, జోష్ టాంగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

జడేజా-సుందర్ ఉపయోగకరమైన ఇన్నింగ్స్

రెండో రోజు ఐదు వికెట్లకు 310 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ తరఫున గిల్, జడేజా ఆరో వికెట్ కు 203 పరుగులు జోడించారు. అయితే, జడేజా 89 పరుగుల వద్ద అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. ఆ తర్వాత గిల్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఇన్నింగ్స్ పంచుకుని తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

Tags:    

Similar News