భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషపై భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే తనతో దిగిన ఫొటోలను పీటీ ఉష సోషల్ మీడియాలో షేర్ చేశారని.. తనకు అండగా ఉన్నట్లుగా ప్రచారం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో రెజ్లింగ్ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరుకున్న వినేశ్ ఫొగట్‌పై అనూహ్య రీతిలో వేటు పడిన సంగతి తెలిసిందే. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో దేశం మొత్తం షాక్ కు గురైంది. బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించిన వినేశ్ ఫొగట్ అస్వస్థకు గురై ప్యారిస్ ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఐఏఓ అధ్యక్షురాలు పీటీ ఉష హాస్పిటల్‌కు వెళ్లి వినేశ్‌ను పరామర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉష సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దీనిపై వినేశ్ స్పందిస్తూ.. పీటీ ఉష మేడమ్ తనకు కష్టసమయంలో ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించింది. తన విషయంలో చాలా రాజకీయాలు నడిచాయని.. అందువల్లే తన మనసు విరిగిపోయిందని చెప్పింది. అందుకే విరక్తిపుట్టి ఇక కుస్తీకి స్వస్తి పలకాలనే కఠిన నిర్ణయానికి వచ్చానంటూ ఆమె ఉద్వేగానికి లోనైంది.