CT2025: దాయాదుల సమరం.. భారత్‌దే విజయం

శతక్కొట్టిన కోహ్లీ... పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం;

Update: 2025-02-24 00:30 GMT

దాయాదుల సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహీ శతక గర్జన చేసిన వేళ... ఛాంపియన్స్ ట్రోఫీకే హైలెట్‌గా నిలిచిన మ్యాచులో భారత జట్టు విజయ కేతనం ఎగరేసింది. తొలుత పాకిస్థాన్‌ను తక్కువ పరుగులకే భారత జట్టు.. ఆ తర్వాత లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఆరంభంలో శుభ్‌మన్ గిల్ విజయానికి బాటలు వేయగా... తర్వాత కోహ్లీ అజేయ శతకం చేసి భారత జట్టుకు విజయాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ (100*; 111 బంతుల్లో 7 ఫోర్లు) బౌండరీ బాది శతకం పూర్తి చేసుకోవడంతో మ్యాచ్‌ను ముగించాడు. శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించారు. ఈ విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

కోహ్లీ సూపర్ సెంచరీ

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఆటతీరు మాములుగా ఉండదని మరోసారి నిరూపితమైంది. టీ 20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ అలాంటి ఆటతీరే కనబరిచాడు. ఫామ్ లేదంటూ విమర్శల వర్షం కురుస్తున్న వేళ కోహ్లీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. శతకంతో గ్రౌండ్‌లో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశారు. 111 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. పాక్‌పై ఇది నాలుగో సెంచరీ కాగా.. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ శతకం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే కోహ్లీ చెలరేగుతాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

తక్కువ పరుగులకే పరిమితమైన పాక్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌లో షకీల్(62), రిజ్వాన్(46) రన్స్‌తో రాణించగా.. చివరల్లో ఖుష్ఠిల్ షా (38) పరుగులు చేశాడు. ఓ దశలో పాకిస్థాన్.. 44 ఓవర్లు ముగిసేసరికి 200 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. మిగత బ్యాటర్లు అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కుల్‌దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, పాండ్య 2, అక్షర్, జడేజా తలో వికెట్ తీశారు.

కోహ్లీ మరో రికార్డు

వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 15 పరుగుల వద్ద ఈ ఫీట్ సాధించాడు. ఇదే క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగులు చేయగా.. కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు.

Tags:    

Similar News