IND vs AUS: పొట్టి సమరంలో ఆధిక్యం ఎవరిదో..?
నేడు భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ 20.. సమఉజ్జీలుగా ఉన్న టీమిండియా-ఆసీస్.. విజయంపై కన్నేసిన రెండు జట్లు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ 20కి ఆస్ట్రేలియా భారత్ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-1 ఆధిక్యం సాధించడమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. హోబర్ట్ వేదికగా జరగనున్న ఈ మ్యాచులో ఘన విజయం సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. మూడో టీ 20లో అద్భత విజయం సాధించిన భారత్.. గెలుపు కాంబినేషన్‌తోనే బరిలోకి దిగనుంది. శివమ్ దుబే స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. జితేష్ శర్మ వికెట్ కీపర్-ఫినిషర్‌గా కొనసాగుతారు. శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో పాటు టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌కు నాయకత్వం వహిస్తుండగా, బుమ్రా, అర్ష్‌దీప్, బలమైన స్పిన్ త్రయం భారత బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచులో విజయ బావుటా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ పై పట్టు సాధించాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
సిరీస్ నుంచి కుల్దీప్ అవుట్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో ఉన్న టీమిండియాకు షాక్. ఆసీస్‌తో జరిగే నాలుగు, ఐదు టీ20 మ్యాచ్‌లకు కుల్దీప్ దూరం కానున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఇండియా ఏ జట్టుకు పంపారు. నవంబర్ 6న బెంగళూరులో దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగే అనధికారిక టెస్టులో కుల్దీప్ ఆడతాడు. టెస్టుల్లో కుల్దీప్ ఫామ్ కొనసాగించడంపై మేనేజ్మెంట్ దృష్టి సారించింది. నవంబర్ 14న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు కుల్దీప్కి రెడ్ బాల్ క్రికెట్ ప్రాక్టీస్ అవకాశం కల్పించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల కుల్దీప్ను ఇండియా ఏ జట్టులోని రెండో అనధికారిక టెస్ట్‌కు ఎంపిక చేశారు. ఈ మ్యాచ్ నవంబర్ 6న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రారంభమవుతుంది.
ఆ భయం ఉండదు
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్ ఓడుతుందనే భయం ఉండదు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారత జట్టులో ఇద్దరు ప్లేయర్ల ఫామ్ టీమిండియాను కలవరపరుస్తుంది. గిల్, సూర్య జట్టుకు కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. వీరిద్దరు కూడా టి20 ఫార్మాట్లో గత 10 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ చేసింది లేదు. గిల్ వరుసగా విఫలం అవుతున్నా అతడికి గంభీర్ అండ ఉండటంతో.. .. అతడు మరో 10 మ్యాచ్‌ల్లో విఫలం అయినా ఓపెనర్‌గా అయితే ఉంటాడు.