IND vs ENG: ఇక భారమంతా బౌలర్లపైనే
విజయానికి 324 రన్స్ దూరంలో ఇంగ్లాండ్.. ఎనిమిది వికెట్ల దూరంలో టీమిండియా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 50/1;
ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారింది. విజయానికి ఇరు జట్లు సమాన దూరంలో నిలిచాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లిష్ జట్టు.. ఆట ముగిసే సమయానికి 50/1తో నిలిచింది. జాక్ క్రాలీ (14)ని సిరాజ్ ఔట్ చేశాడు. బెన్ డకెట్ (34*) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 324 పరుగులు అవసరం. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో 75/2తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 396 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118; 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం (ఓవర్‌నైట్ 51) బాదాడు. ఆకాశ్ దీప్ (66; 94 బంతుల్లో 12 ఫోర్లు) అర్ధ శతకంతో (ఓవర్‌నైట్ 4)ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (53; 77 బంతుల్లో 5 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ధ్రువ్ జురెల్ (34; 46 బంతుల్లో) పర్వాలేదనిపించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (53; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి సుందర్ పదో వికెట్‌కు 39 పరుగులు (25 బంతుల్లో) జోడించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/125) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. గస్ అట్కిన్సన్(3/127) మూడు వికెట్లు పడగొట్టాడు. జెమీ ఓవర్టన్(2/98) రెండు వికెట్లు తీసాడు. చివర్లో దూకుడుగా ఆడి విలువైన హాఫ్ సెంచరీతో సుందర్ మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
భారమంతా బౌలర్లపైనే
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్(34 బ్యాటింగ్) ఉండగా.. జాక్ క్రాలీ(14)ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 324 పరుగుల అవసరం కాగా.. మరో 8 వికెట్లు తీస్తే భారత విజయం లాంఛనమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ డ్రా అవుతుంది. భారత బౌలర్లపైనే విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
జైస్వాల్ సెంచరీ..
రెండో సెషన్ ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్‌ను గస్ అట్కిన్సన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి కరుణ్ నాయర్ రాగా.. అట్కిన్సన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ సింగిల్ తీసి 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే కరుణ్ నాయర్(17)ను అట్కిన్సన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. జడేజాతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జోష్ టంగ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ సాధికరింగా బ్యాటింగ్ చేసింది. ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఓవర్టన్ విడదీసాడు. ధ్రువ్ జురెల్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి సుందర్ రాగా.. జడేజా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.