Swati maliwal: నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు
ఆప్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండటంతో సామాజిక మాధ్యమాల్లో హత్య, అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని రాజ్యసభ ఎంపీ స్వాతిమాలీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. తనకు వచ్చిన బెదిరింపుల స్క్రీన్‌షాట్లను స్వాతీ ఎక్స్‌లో పంచుకున్నారు. ఆప్ నేతలు, వాలంటీర్లు, కార్యకర్తలు అంతా కలిసి తన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని.. ఇందుకు యూట్యూబర్ ధ్రువ్‌రాథే చేసిన వీడియోనే ఉదాహరణ అని స్వాతీమాలీవాల్ వివరించారు. తనకు వ్యక్తిరేకంగా ధ్రువ్‌రాథే 2.5నిమిషాల నిడివి గల వీడియో పోస్టుచేశారని తెలిపారు. ఆయన స్వతంత్ర జర్నలిస్టుగా చెప్పుకునే ఆప్ ప్రతినిధి అని ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఆప్ నాయకత్వం తనపై ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నారు.
‘‘స్వతంత్ర జర్నలిస్టులమని చెప్పుకొనే ఇలాంటి వ్యక్తులు ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు. ప్రస్తుతం నేను అన్నివైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నా’’ అని మాలీవాల్ ఆదివారం ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేసేందుకే పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ధ్రువ్‌ను కలిసి తన వాదన వినిపిద్దామంటే.. అతడు తన ఫోన్‌కాల్స్‌కు స్పందించడం లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తోందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో మే 13న మాలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సీఎం సహాయకుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు మే 18న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిలు కోరుతూ బిభవ్ శనివారం స్థానిక కోర్టును ఆశ్రయించాడు.