Telangana assembly polls: తొలిరోజు వంద నామినేషన్లు
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, స్వతంత్రులు;
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల సమరంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 119 నియోజకవర్గాలకు తొలిరోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తొలిరోజు పలుచోట్ల నామినేషన్లు వేయగా... అధికార బీఆర్‌ఎస్ నుంచి ఎవరూ వేయలేదు. తొలిరోజు నామినేషన్లలో అధికంగా స్వతంత్ర అభ్యర్థులవే ఉండగా.... చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులూ అక్కడక్కడ నామపత్రాలు దాఖలు చేశారు.
తొలిరోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి 8మంది, బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా అధికార పార్టీ నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తరఫున కొడంగల్‌లో ఆయన సోదరుడు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి నామినేషన్ వేశారు. హైదరాబాద్ గోశామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతారావు అబిడ్స్ GHMC కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఖైరతాబాద్‌లో సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున జ్యోతి నామినేషన్ వేశారు. మలక్‌పేట్‌లో BSP అభ్యర్థి అలుగోల రమేశ్ నామినేషన్ వేశారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ 2 నామినేషన్లు దాఖలు చేశారు. చేవెళ్లలో భాజపా అభ్యర్థి K.S.రత్నం తరఫున ఆయన కుమారుడు నామపత్రాలు దాఖలు చేశారు. సంగారెడ్డిలో మంజీరా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పృథ్విరాజ్ నామినేషన్ వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్ధులు 11 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్ధులు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాజనాల శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పరకాలలో ఓ స్వతంత్ర అభ్యర్ధి, మహబూబాబాద్‌లో బీజేపీ రెబల్ అభ్యర్ధి గుగులోత్ వెంకన్న, పాలకుర్తి నుంచి స్వతంత్ర అభ్యర్ధి, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి మరో స్వతంత్ర అభ్యర్ధి నామపత్రాలు సమర్పించారు. భూపాలపల్లిలో 2 నామినేషన్లు దాఖలు కాగా బీజేపీ నుంచి కీర్తిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ తరఫున ఆయన సతీమణి నామపత్రాలను సమర్పించారు. నర్సంపేట నుంచి ఎంసీపీఐ అభ్యర్థితో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేశారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, జనగామ, డోర్నకల్, ములుగు నియోజకవర్గాల్లో తొలిరోజు నామినేన్లు దాఖలు కాలేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం నియోజకవర్గంలో 3, పాలేరు లో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇద్దరు అభ్యర్థులు పార్టీల తరపున అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేయగా మరో ముగ్గురు స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.