Hyderabad Municipal Corporation : గ్రేటర్ ఎన్నికలపై మూడు పార్టీల ఫోకస్..
మొన్ననే మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అంతలోనే గ్రేటర్ ఎన్నికలపై మూడు పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఓఆర్ ఆర్ దాకా జీహెచ్ ఎంసీనీ విస్తరించిన సంగతి తెలిసిందే. జీహెచ్ ఎంసీతో పాటు మల్కాజిగిరి కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లుగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఉండే సగం జనాభా ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ గెలుపు మూడు పార్టీలకు చాలా కీలకంగా మారిపోయింది. ఇక్కడ కార్పొరేషన్లను గెలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈజీగా గెలవొచ్చు అని మూడు పార్టీలు ఆలోచిస్తున్నాయి. అతి త్వరలోనే కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 12 జోన్లుగా విభజించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్కో జోన్ కు ఒక్కో మంత్రిని నియమించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది.
గ్రేటర్ పై తమ జెండా ఎగిరితే సిటీలో తిరుగులేని పట్టు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన బీఆర్ ఎస్.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు సాధించింది. కాబట్టి అదే ఫార్ములాను ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ పాటిస్తున్నట్టు తెలుస్తున్నాయి. కాంగ్రెస్ మంత్రులు వరుసగా జీహెచ్ ఎంసీలో పర్యటిస్తూ తమ పట్టును పెంచుకోవాలని చూస్తున్నారు. అలాగే బీఆర్ ఎస్ కూడా వరుస ప్రోగ్రామ్స్ తో గ్రేటర్ పరిధిలో పట్టును కాపాడుకోవాలని చూస్తోంది.
అటు బీజేపీ కూడా ఇక్కడ తమ పట్టును మళ్లీ పెంచుకోవాలని చూస్తోంది. బీజేపీకి అర్బన్ ఏరియాల్లోనే పట్టు ఉంటుంది కాబట్టి.. దాన్ని ఇక్కడ నిరూపించుకుంటేనే ఆ పార్టీకి మనుగడ సాధ్యం అవుతుంది. అందుకే బీజేపీ పార్టీ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా సరే మూడు పార్టీల నేతలు గ్రేటర్ పరిధిలో ఎక్కువగా పర్యటనలు చేస్తూ.. ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ తమ పట్టును పెంచుకోవాలని చూస్తున్నాయి.