Amit Shah: కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే కేటీఆరే సీఎం అవుతారు: అమిత్ షా

Amit Shah: బీజేపీ నిర్వహించిన మునుగోడు సమరభేరీ సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది.;

Update: 2022-08-21 15:45 GMT

Amit Shah: బీజేపీ నిర్వహించిన మునుగోడు సమరభేరీ సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరారు. రాజ్‌గోపాల్‌ రెడ్డికి పార్టీ కండువా కప్పి అమిత్‌ షా అభినందించారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్టు కాదని, రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుందుందన్నారు అమిత్‌ షా.

తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానన్న కేసీఆర్‌.. ఎంఐఎంకు భయపడి మాట తప్పారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. విమోచన దినోత్సవం నిర్వహిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై అమిత్‌ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ దళితులను దగా చేసిందని మండిపడ్డారు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ, తన కుటుంబంలోని అందరికీ ఉపాధి ఇచ్చుకున్నారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ వైఖరి వల్లే దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తెలంగాణలోనే అధికంగా ఉందని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటిఎంగా మారిందని దుయ్యబట్టారు. అమ్ముడు పోయానని విమర్శిస్తున్న వారిని రాజగోపాల్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని, రాజీనామా చేసి నిజాయితీగా ప్రజల తీర్పు కోరుతున్నానన్నారు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఎప్పటికీ చేయనని స్పష్టం చేశారు. తన రాజీనామాతో ఫామ్‌ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ నిద్రలేచి మునుగోడుకు వచ్చారు..

గట్టుప్పల్‌ మండలం అయింది.. కొత్త పింఛన్లు వచ్చాయి.. నియోజకవర్గంలో కొత్త రోడ్లు, అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవం కోసం వచ్చిన ఎన్నికగా పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు పలువురు మునుగోడు సభకు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన జనం సభ చివరి వరకు ఓపికగా ఉండడంతో బీజేపీ నేతల్లో జోష్‌ నింపింది. ఒకరోజు వ్యవధిలో ఇటు టీఆర్‌ఎస్‌, అటు బీజేపీ సభలతో మునుగోడులో రాజకీయ వేడి పెరిగింది.

Tags:    

Similar News