SAD: సూదీ మందు ఇచ్చి తల్లిదండ్రులను చంపిన కూతురు
వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన... తల్లిదండ్రులను చంపిన కూతురు.. ప్రేమకు అడ్డు వస్తారని ఘాతుకం..సూదీమందు ఇచ్చి తల్లిదండ్రుల హత్య
డుపులో మోసి, ప్రాణంగా పెంచిన కూతురు… చివరకు అదే చేతులతో ప్రాణాలు తీస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. తెల్లవారితే పెళ్లి చూపులు జరగాల్సిన ఆ ఇంట్లో మృత్యు ఘోష వినిపించింది. ప్రేమ పేరుతో మత్తులో మునిగిన ఓ కూతురు.. తన ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న ఆగ్రహంతో కన్నతల్లిదండ్రులనే చంపేసింది. సూదిమందు ఇస్తానని చెప్పిన కూతురు మాటలు నమ్మిన తల్లిదండ్రులు... అదే సూదిలో దాగి ఉన్న మరణాన్ని గుర్తించలేకపోయారు. తెల్లవారితే పెళ్లి చూపులు జరగాల్సిన ఆ ఇంట్లో, తెల్లవారకముందే రెండు ప్రాణాలు ఆరిపోయాయి. వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం … ప్రేమ పేరుతో జరిగే అఘాయిత్యాలకు సాక్ష్యంగా నిలిచింది. వికారాబాద్ జిల్లా యాచారం గ్రామంలో జరిగిన ఘోర హత్య కేసులో కుమార్తెనే నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ, తన ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరన్న భయంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. పెళ్లి చూపులకు ముందు రోజు రాత్రి తల్లిదండ్రులకు సూదిమందు ఇస్తానని చెప్పి, విషం కలిపిన ఇంజెక్షన్‌ను ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు దశరథ్, లక్ష్మి దంపతులు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సురేఖ చిన్న కూతురు కాగా, ఆమె కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఆ ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోరన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని నటిస్తూ, సురేఖ తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే ఇంటికి చేరుకున్న అశోక్, తల్లిదండ్రులు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో కీలక ఆధారాలు లభించాయి. ఇంట్లో లభించిన ఇంజెక్షన్లు, వైద్యపరమైన వివరాల ఆధారంగా అనుమానం సురేఖపైకి మళ్లింది. ప్రశ్నించగా, తానే తల్లిదండ్రులను హత్య చేసినట్లు సురేఖ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఉపయోగించిన ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరుగుతుండగానే చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రేమ పెళ్లి విషయంలో కుటుంబ విభేదాలు ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తున్నాయన్న ఆందోళనను ఈ కేసు మరింత బలపరిచింది.ప్రస్తుతం నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.