ASSEMBLY: సీబీఐ చేతికి "కాళేశ్వరం ప్రాజెక్టు"
తెలంగాణ శాసనసభ సంచలన నిర్ణయం.. కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం.. రీడిజైన్ పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు కొల్లగొట్టారన్న సీఎం.. అర్ధరాత్రి దాటాకా సాగిన సభ
కాళేశ్వరం నివేదికను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టులో లోపాలున్నాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగిందని. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మూడు బ్యారేజీలలో భారీగా డ్యామేజ్ జరిగిందని తెలిపింది. దీనిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది. ఆదివారం శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ, పీఎఫ్సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లను దోచుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. ఆనాడు మహారాష్ట్రతో చర్చ జరిగింది కేవలం ప్రాజెక్టు ఎత్తు గురించే అని గుర్తుచేశారు. కావాలనే హరీష్ రావు పదే పదే తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని చెప్పినా మీరెందుకు వినలేదని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పలేదు. లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లే.. ప్రాజెక్టు కడితే హానికరం, నిరుపయోగం అని అధికారులు పదే పదే చెప్పారు.
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
శాసనసభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. సభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్లుగానే భావిస్తున్నారని అన్నారు.
హరీశ్‌రావు ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుకు అసెంబ్లీ స్పీకర్ అవకాశం ఇచ్చారు. అరగంటలో సమాధానం చెప్పాలని అవకాశమిచ్చారు. దీంతో స్పీకర్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. 600 పేజీల నివేదికపై అరగంటలో ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కనీసం రెండు గంటలు సమయం కావాలని అడిగారు. తాము వెనకడుగు వేయబోమని.. ఎన్ని రోజులైనా కాళేశ్వరంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం నడపటం చేతగాక.. సర్కస్ చేస్తున్నారని హరీష్ రావు సీరియస్ అయ్యారు.