CBN: గ్యాస్ సిలిండర్లు పక్క దోవ పట్టొద్దు
గ్యాస్ సంక్షోభం వేళ స్పందించిన చంద్రబాబు... 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందని వెల్లడి... మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ ఉందన్న సీఎం
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై పడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరతపై చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం గృహ వినియోగదారులకు అవసరమైన గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నప్పటికీ, కొంతమంది వినియోగదారులు ముందస్తుగా బుకింగ్స్ చేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, పంపిణీ వ్యవస్థ, భవిష్యత్ అవసరాలపై సమగ్రంగా చర్చించారు.
సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ నిల్వలు మరో 15 రోజుల అవసరాలకు సరిపోతాయని ఆయన తెలిపారు. త్వరలోనే మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ రాష్ట్రానికి చేరుకునే అవకాశముందని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలు వంటి సంస్థలకు నిరంతర గ్యాస్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా అధికారులు ముందుగానే ఆలోచించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్‌ల నిల్వలను పెంచాలని ఆయన సూచించారు. గ్యాస్ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. ఈ కేవైసీ, ఓటీపీ విధానాల ద్వారా మాత్రమే బుకింగ్‌లు జరిగేలా గ్యాస్ ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠినంగా పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. అలాగే గ్యాస్ కంపెనీలు కొంతకాలం ఉత్పత్తిని పెంచి సరఫరాను మెరుగుపరచాలని సూచించారు. రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.
ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కూడా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా–గోదావరి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే సహజ వాయువును పైప్డ్ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సిఎన్‌జీ, పిఎన్‌జీ గ్యాస్ వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం మీద అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకుండా అవసరమైన సమయంలో మాత్రమే బుకింగ్‌లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.