ASSEMBLY:" లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలింది"
బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చను ప్రారంభించిన ఉత్తమ్.. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను మొదలుపెట్టారు. రూ.87,449 కోట్లతో నిర్మాణం చేపట్టారు. కట్టిన కొన్ని నెలలకే ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మేడిగడ్డ కుంగింది. రూ.21 వేల కోట్లతో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టారు. 20 నెలలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయి. తాము ప్రాణహితపై 2014 నాటికే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వాప్కోస్ రిపోర్ట్ కంటే ముందే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని అప్పటి ప్రభుత్వం డిసైడయ్యింది. వాప్కోస్ రిపోర్ట్ ఇచ్చినరోజే మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మించాలని ఆదేశించింది.
అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం పనులను కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. తెలంగాణకు ఇది చాలా బాధాకరమైన రోజు అని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత - చేవెళ్ల కట్టాలని 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ప్రాణహిత - చేవెళ్లపై 2014 నాటికే రూ.11,600 కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు సరికాదని నాటి ప్రభుత్వ కమిటీ చెప్పిందని వివరించారు. మంత్రి ఉత్తమ్ ప్రసంగానికి అడుగడుగునా బీఆర్ఎస్ నేతలు అడ్డుపడారు.
బీసీ వర్గాల చారిత్రాత్మక విజయం: సీతక్క
బిసీ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి సీతక్క కీలక ట్వీట్ చేశారు. 'మా నాయకుడు రాహుల్ గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీల నాయకత్వంలో.. పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టాం. ఈ బిల్లు కేవలం రిజర్వేషన్ల గురించి మాత్రమే కాదు. ఇది బీసీలకు సాధికారత కల్పించడం, వారి గొంతుకను వినిపించడానికి విప్లవాత్మకమైన అడుగు.' అని రాసుకొచ్చారు. మన ప్రజా ప్రభుత్వం బిసిల వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఇంటింటికీ సమగ్ర కుటుంబ సర్వే, శాస్త్రీయ కుల గణనను నిర్వహించింది. అంకితమైన కమిషన్ సిఫార్సుల ఆధారంగా, బిసిలకు 42% రిజర్వేషన్లు అందించడానికి మేము తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 285A ని సవరించాము. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం బీసీ వర్గాలకు ఇది చారిత్రాత్మక విజయం" అంటూ సీతక్కలో రాసుకొచ్చారు.