తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ ఎన్నికల కోసం ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. అభిషేక్ సింఘ్వీకి, వేం నరేందర్ రెడ్డికి ఈ స్థానాలను కేటాయించింది. దీంతో బీఆర్ ఎస్ వ్యూహమేంటి అంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి దాకా బీఆర్ ఎస్ కూడా బరిలో నిలుస్తుందనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా బీఆర్ ఎస్ కు మెజార్టీ లేకపోయినా.. పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ భావించినట్టు మొన్నటి దాకా ప్రచారం జరిగింది. బీఆర్ ఎస్ పోటీ చేస్తే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటేస్తారు అనే కోణంలో ఊహాగానాలు వినిపించాయి. ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ వాళ్లే అని ఇప్పటికే స్పీకర్ తీర్పు ఇచ్చారు. మిగిలిన ఇద్దరి విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కాగా బీఆర్ ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో అసలు పోటీ చేస్తుందా లేదా అనే ప్రచారాలు మొదలయ్యాయి.
బీఆర్ ఎస్ ఒకవేళ పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటే అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడే గులాబీ దళపతి కేసీఆర్ మరో ప్లాన్ వేస్తున్నారంట. విప్ జారీ చేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. బీఆర్ ఎస్ విప్ జారీ చేస్తే 10 మంది ఎమ్మెల్యేలకు చిక్కులు తప్పవు. వారు ఎటూ ఓటేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్లు ఓటేయకపోతే కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ స్థానాలు దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కో రాజ్యసభ స్థానం కోసం కనీసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ లెక్కన రెండు స్థానాలకు కలిపి 80 మంది కాంగ్రెస్ పార్టీకి కావాలి.
మరి పది మంది ఓటేస్తే లీగల్ గా చిక్కులు తప్పవు. అలా కాకుండా బీఆర్ ఎస్ కు ఓటేయలేని పరిస్థితి వస్తుంది. బీఆర్ ఎస్ పోటీ చేసినా ఎలాగూ రాజ్యసభ స్థానాలు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి పోటీ చేయకపోయినా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికి మాత్రం బీఆర్ ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ రాజ్యసభ సీట్ల విషయంలో ఏం జరుగుతుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.