AZHAR: హ్యాట్రిక్ సెంచరీల నుంచి మంత్రి పదవి వరకు..
కొత్త ఇన్నింగ్స్‌కు అజారుద్దీన్ సిద్ధం.. అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు... క్రికెట్లో టాలెంటెడ్ బ్యాటర్ అజారుద్దీన్
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా, అత్యంత వివాదాస్పదుల్లో ఒకరిగా నిలిచిన మహ్మద్ అజారుద్దీన్ మరో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యారు. హైదరాబాదీ అయిన అజార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్రికెట్ మైదానం నుంచి రాజకీయ అధికార కేంద్రం వరకు ఆయన ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలు, ఊహించని మలుపులతో నిండి ఉంది.
ఆ అరంగేట్రం.. ఓ అద్భుతం
1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అజారుద్దీన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సెంచరీలు (మొదటి మూడు టెస్టుల్లో సెంచరీలు) సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. తన మణికట్టు మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశారు. 90వ దశకంలో భారత జట్టుకు సారథ్యం వహించి, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. 1984లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్.. ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. 1985లో తొలి వన్డే మ్యాచ్ ఆడారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1984 – 2000 మధ్య 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన అజారుద్దీన్.. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయన క్రికెట్ కు దూరమయ్యారు. 2012లో కోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా అజారుద్దీన్ ఎదిగారు. 2009లో భారత రాజకీయాల్లో తొలిసారి అడుగు పెట్టారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. తొలిసారి యూపీలోని మొరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రాజస్థాన్ మాథోపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన.. 2023లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
మ్యాచ్ ఫిక్సింగ్
అయితే 99 టెస్ట్ మ్యాచ్‌లతో అపారమైన కీర్తిని సంపాదించుకున్న అజార్ కెరీర్‌కు 2000వ సంవత్సరంలో అకస్మాత్తుగా తెరపడింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఈ వివాదం భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని రద్దు చేసినప్పటికీ ఆయన కెరీర్ ముగిసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు (వివాహాలు, విడాకులు) వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పోరాట పటిమను కోల్పోకుండా అజారుద్దీన్ క్రికెట్ గ్లోరీ నుంచి పొలిటికల్ పవర్ వరకు చేరుకున్నారు. ఇది ఆటగాడిగా ఆయన జీవితం ముగిసిపోలేదని, రాజకీయ నేతగా ఆయన కొత్త శక్తిని పుంజుకున్నారని తెలియజేస్తుంది. . 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆయన క్రికెట్ కు దూరమయ్యారు. 2012లో కోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది.