Bandi Sanjay: అరెస్టయినా దీక్షను కొనసాగిస్తున్న బండి సంజయ్.. మరికాసేపట్లో కోర్టులో హాజరు..
Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపిచ్చింది బీజేపీ.;
Bandi Sanjay (tv5news.in)
Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపిచ్చింది బీజేపీ. మరోవైపు బండి సంజయ్ దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి మానకొండూరు పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష కొనసాగించారు. ఈ ఉదయం ఆయన్ను కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు పోలీసులు. బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరచనున్నారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద బండి సంజయ్‌తో సహా 12 మంది నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాగరణ దీక్ష భగ్నం చేయడంతో పాటు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై బీజేపీ ఆందోళనకు సిద్ధమైంది. బండి సంజయ్‌కు మద్దతుగా కరీంనగర్ వెళ్లకుండా ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి తన ఇంటి ముందు పోలీసులను మోహరించారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కాసేపట్లో నగర అధ్యక్షుడిని కలిసేందుకు బయల్దేరుతున్నానని, పోలీసులు అడ్డుకుంటారో లేక పట్టుకుంటారో చూస్తానంటూ సవాల్ విసిరారు రాజాసింగ్. జాగరణ దీక్షను భగ్నం చేయడంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిస్తానని హెచ్చరించారు బండి సంజయ్.
తన కార్యాలయంలోకి వచ్చి పోలీసులు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రూల్స్ కేటీఆర్‌కు వర్తించవా అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు ఇచ్చిన జీవోలో తప్పులను ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. బదిలీల జాబితాలను డీఈవో ఆఫీసులలో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, వారికి భరోసా కల్పించడానికి జాగరణ దీక్ష చేపట్టామని తెలిపారు. అయితే, జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ పార్టీ ఆఫీస్ డోర్లు బద్దలు కొట్టి మరీ తనను అరెస్టు చేయడంపై బండి సంజయ్ మండిపడ్డారు.
నిన్న మధ్యాహ్నం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు కరీంనగర్‌లోని ఎంపీ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టు చేశారు. టెంట్లు, కుర్చీలు, లైట్లు, సౌండ్ సిస్టమ్, వేదికను తొలగించారు. దీంతో పార్టీ శ్రేణులు, నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలోనే పార్టీ శ్రేణులతో కలిసి వచ్చిన బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా సరే లోపలికి వెళ్లి దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల సమయంలో జాగరణ దీక్షను ప్రారంభించిన పార్టీ నేతలు.. ఆ తరువాత ఆఫీస్ మెయిన్ డోర్లను మూసివేశారు. జాగరణ దీక్ష మొదలైన తరువాత.. పార్టీ ఆఫీసుకు వచ్చే ఒక్కో నాయకున్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
రాత్రి 9 గంటలకు ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌ను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభతోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. అప్పటికే లోపల ఉన్న పార్టీ శ్రేణులు తమ నాయకుడిని అరెస్టు చేస్తే పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజిన్ తెప్పించి ఆఫీస్ లోపల నీళ్లు చల్లించారు.
రాత్రి 10:30 గంటలకు గేటును దాటి తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సమయంలో కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాటలో సంజయ్ తలకు గాయమైందని కార్యకర్తలు చెబుతున్నాయి. అయినా సరే పోలీసులు బండి సంజయ్‌ను తీసుకెళ్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీక్ష భగ్నం చేసి బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆఫీస్ డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లడం ఏంటని నిలదీశారు. అటు ఎంపీ అరవింద్ కూడా పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి, అరెస్టు చేయడం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని అర్వింద్ తీవ్రంగా ఖండించారు.
మంత్రి కేటీఆర్‌కు లేని నిబంధనలు బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు. పార్టీ ఆఫీసులో కూర్చుని నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం అప్రజాస్వామికమని ఈటల రాజేందర్ విమర్శించారు.