Basara IIIT: నిరసన విరమించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.. సబితా ఇంద్రారెడ్డి హామీతో..
Basara IIIT: బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు నిరసన విరమించారు. విద్యార్ధులతో సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి;
Basara IIIT: బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు నిరసన విరమించారు. విద్యార్ధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ట్రిపుల్ ఐటీ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలంటూ ఏడురోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేశారు. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ స్వయంగా బాసర రావాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. నిన్న రాత్రి తొమ్మిదిన్నర నుంచి రెండున్నర గంటలకుపైగా విద్యార్ధులతో చర్చలు జరిపింది. అర్ధరాత్రి పన్నెండున్నర సమయంలో చర్చలు సఫలం అయ్యాయని, తాము ఆందోళన విరమిస్తున్నామని విద్యార్ధులు ప్రకటించారు.
ఇవాళ్టి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. మొత్తం 12 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరపున మంత్రి సబిత ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. మౌలిక సౌకర్యాలకు తక్షణమే ఐదున్నర కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీకి ఛాన్స్‌లర్‌ను నియమిస్తామన్నారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ విద్యార్ధులతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు.