BC RESERVATIONS: బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్‌పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీవోలు ఖరారు చేశారు. ఈ జీవోలను పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు. ఇక క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్టు సమాచారం. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం, ఎస్సీ,ఎస్టీలకు 27 శాతం, పూర్తిగా 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలకు పోతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన డేటాను సీల్డ్ కవర్ల రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు ఈసీ కీలక సమావేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది.
మండల, జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో జారీ అయ్యింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీల రిజర్వేషన్ల విధానంపై పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చింది. బీసీలకు కులగణన డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. రేపు రాజకీయ పార్టీల సమక్షంలో డ్రా ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మండల, జిల్లా పరిషత్ లకు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉంది.