Telangana Municipal Polls : మున్సిపాలిటీల్లో పొత్తులు.. అప్పుడు కూడా రిపీట్ అవుద్దా..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చాలా చిత్ర, విచిత్రమైన మార్పులు కనిపించాయి. ఎన్నడూ లేని విధంగా బద్ద శత్రువులు అని చెప్పుకునే పార్టీలు ఒక్కటైపోయాయి. కాంగ్రెస్ తో బీజేపీ పొత్తులు పెట్టుకుంది. బీజేపీతో బీఆర్ ఎస్ పొత్తులు పెట్టుకుంది. కాంగ్రెస్ తో బీఆర్ ఎస్ చేతులు కలిపింది. ఇలా రకరకాల పొత్తులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అతిపెద్ద ఎన్నికలు ఇవే. వీటిని చూస్తే అర్బన్ ఓటర్లు ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పోరు కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓటు షేర్ శాతం కూడా మూడు పార్టీలు దగ్గర దగ్గరగానే ఉన్నాయి.
కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీల్లో గెలిచినా.. అందులో కొద్ది పాటి మెజార్టీతో గెలిచినవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి అప్పటి వరకు కాంగ్రెస్ మీద ప్రజల్లో ఇలాంటి ఆలోచనలే ఉంటాయనే గ్యారెంటీ ఎలూగూ లేదు. కాబట్టి అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్, బీజేపీలు బలంగా పుంజుకుంటే మాత్రం.. కాంగ్రెస్ కు గట్టి పోటీ తప్పేలా లేదు.
అదే జరిగితే ఇప్పుడు అత్యధిక మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హంగ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పుడు హంగ్ వస్తే విభేదాలు పక్కన పెట్టి పదువులు పంచుకున్నాయి పార్టీలు. అప్పుడు కూడా పార్టీలు ఒక్కటైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాబట్టి ఇప్పటినుంచే అన్ని పార్టీలు ప్రజల్లో బలాన్ని పెంచుకుని ముందుకు వెళ్తేనే ఈ హంగ్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే అంతే సంగతులు.