BJP: వివాద రహితులకే బీజేపీ పగ్గాలు
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఖరారు.. తెలంగాణ చీఫ్‌గా రామచందర్‌రావు, ఏపీ అధ్యక్షుడిగా మాధవ్;
బీజేపీ నిర్ణయాలు చాలామందికి అంతుబట్టవు. నేతలు ఒకటి భావిస్తే.. హైకమండ్ తీసుకునే నిర్ణయాలు మరోలా ఉంటాయి. మోదీ-అమిత్ షా వచ్చాక ఆ పార్టీ రూపురేఖలు మారిపోయాయి. అందరూ ఊహించిన మాదిరిగానే వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులకు కమలం పార్టీలో అగ్రస్థానం దక్కుతుందన్న వాదన ఉంది. ఈసారి కూడా అదే నిజమైంది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష పదవుల ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బీజేపీ రథ సారథులు వచ్చేశారు. తెలంగాణకు రామచందర్‌రావు, ఏపీకి మాధవ్ పేర్లు ఖరారయ్యాయి. నేతలిద్దరు తమ తమ రాష్ట్రాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. వివాదాలకు దూరంగా ఉన్నవారికే పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆరు నెలలు వడపోసి చివరకు తెలంగాణకు బీజేపీ చీఫ్‌గా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరు ఖరారైంది. అధ్యక్షుడి పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి చివరివరకు ఈటెల రాజేందర్, ధర్మపురి అర్వింద్ పోటీపడ్డారు. చివరకు రామచందర్‌రావు పేరును అధిష్టానం ఖరారు చేసింది.
ఏపీ అధ్యక్షుడిగా మాధవ్
ఏపీ బీజేపీ పగ్గాలను సీనియర్ నేత, బీసీ నాయకుడు పీవీఎన్ మాధవ్ కి అప్పగించనున్నారు. పార్టీలో విద్యార్ధి దశ నుంచి మాధవ్ పనిచేస్తున్నారు. ఏబీవీపీ నుంచి ఆయనకు బీజేపీతో సహవాసం మొదలైంది. అంతే కాదు ఆయన తండ్రి స్వర్గీయ పీవీ చలపతిరావు బీజేపీ ఉమ్మడి ఏపీలో తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. నిజాయితీతో కూడిన రాజకీఅయం చేయడమే కాకుండా సమర్ధుడిగా మాధవ్ పేరు తెచ్చుకున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్ ని కేటాయించలేదు. అయినా పార్టీ అభ్యర్ధుల విజయానికి పనిచేశారు. పార్టీ ఫస్ట్ అన్న దానికి మాధవ్ కట్టుబడి ఉంటారు. ఉన్నత విద్యాధికుడు అయిన పీవీఎన్ మాధవ్ 2017 నుంచి 2023 దాకా ఉత్తరాంధ్ర పట్టబధ్రుల ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన పార్టీ లైన్ దాటి ఎపుడూ ముందుకు సాగలేదు అని పేరు ఉంది. ఇక ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం ఎంతో సానుకూలంగా ఉండడంతో పాటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మద్దతు కూడా తోడు కావడంతో పీవీఎన్ మాధవ్ బీజేపీకి నూతన అధ్యక్షుడు అవుతున్నారు. పార్టీలో పుట్టి పెరిగిన మాధవ్ అభ్యర్ధిత్వం పట్ల ఎవరికీ వేరే ఆలోచనలు లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇప్పటిదాకా పార్టీ బయట నుంచి వచ్చిన వారికే అధ్యక్ష పదవులు అప్పగించింది.
రామచందర్‌రావుకు పగ్గాలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రాంచందర్ రావు నియమితులయ్యారు. కిషన్ రెడ్డి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాంచందర్ రావు ఆరెస్సెస్, ఏబీవీపీల్లో పనిచేయడంతోపాటు, పార్టీకి విధేయుడు, వివాదరహితుడనే ముద్ర ఉండటంతో అధిష్టానం ఆయన్ను ఎంపిక చేసింది. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఆయనకు క్షేత్రస్థాయిలోనూ అందరితో బలమైన సంబంధాలు ఉండటం బీజేపీకి కలిసి రానుంది. కిషన్ రెడ్డి కంటే ముందు తెలంగాణ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో పార్టీ తెలంగాణలో బాగా పుంజుకుంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు. రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ కావడంతో.. మరోసారి బీసీ నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని చాలా మంది భావించారు. కానీ ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్న రాంచందర్ రావును ఆ పదవి వరించింది. ఏపీలోనూ మొదటి నుంచి బీజేపీతోనే ఉన్న మాధవ్‌కు ఆ పార్టీ పగ్గాలు దక్కుతుండటం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. రాంచందర్ రావు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన ఆరెస్సెస్, ఏబీవీపీల్లో పని చేశారు. బీజేవైఎం, లీగల్ సెల్ల నుంచి ఆయన నాయకుడిగా ఎదిగారు. న్యాయవాది అయిన రాంచందర్ రావు గతంలో హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగానూ పని చేశారు. గెలుపోటములకు అతీతంగా ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పని చేశారు. బీజేపీ అధిష్టానానికి నమ్మకస్తుడు కావడంతోపాటు సౌమ్యుడైన ఆయనకు ఎవరితోనూ ఆయనకు విబేధాలు లేవు. క్షేత్ర స్థాయి కార్యకర్తల దగ్గర్నుంచి అత్యున్నత స్థాయి నేతల వరకు అందరితోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల పట్ల బీజేపీ గత కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించే నేతల కంటే.. వివాద రహితుడు, అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావును ఎంపిక చేయడమే బెటర్ అనే అభిప్రాయానికి కమల నాథులు వచ్చారు.