తెలంగాణ బీజేపీలో అంతర్గత కలహాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు పార్టీలోని వర్గ విభేదాలను మరింత స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించినవనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య గత కొంత కాలంగా ఉన్న రాజకీయ ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత ముదిరి, పార్టీలో ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇలా అయితే కష్టమే:ఈటల
తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. తెలంగాణలో డివిజిన్ పాలిటిక్స్‌తో గెలవలేం అని అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కులం, మతం ప్రాతిపదికగా ఎక్కడా రాజకీయాలు నిలబడవు అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టారు.. గతంలో కేసీఆర్ పనినే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు.. ఇద్దరికీ తేడా ఏం లేదని అన్నారు. కాంగ్రెస్ గతంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా డిపాజిట్ కోల్పోయింది.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోవద్దు అని హితవు పలికారు. మతం ప్రాతిపదికన చేసే రాజకీయాలు నిలబడవు అని ఈటల కామెంట్ చేయడం టాపిక్‌గా మారింది. మరోసారి బండి, ఈటల మధ్య వైరం ముదురుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ బీజేపీలో వర్గ పోరు కొత్తేమీ కాదు. గతంలోనూ ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ, ఈటల 2024లో ఈ విషయాన్ని ఖండించారు. “బండి సంజయ్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, తాజా వ్యాఖ్యలు ఈ ఖండనను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. బీజేపీ అధిష్ఠానం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.