MUNCIPAL RESULT: ఉద్రిక్తతలు.. ఆందోళనలు.. నిరసనలు.. దాడులు
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులతో దాడి.. స్వయంగా దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్...అయిదు అంచెల భద్రత ఏర్పాటు చేసినా దాడి
తెలంగాణలో మున్సిపల్ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనడంతో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. రాళ్లదాడులు, తోపులాటలు, లాఠీచార్జ్‌లతో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక సందర్భంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పైనా దాడి జరగడం పరిస్థితి తీవ్రతను చాటింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అదనంగా రెండు ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. దీంతో ఇరు పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు ప్రారంభించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌లను పోలీసులు అడ్డుకున్నారు. 14 మంది కౌన్సిలర్లతో కలిసి కార్యాలయంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా, మున్సిపల్ కార్యాలయం సమీపంలోని పైవంతెన వద్ద పోలీసులు నిరోధించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. దీనికి ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పైనా, పోలీసులపైనా రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనలో మంత్రి వాహనం, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డట్లు సమాచారం.పోలీసులు ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మరో ఘటన చోటుచేసుకుంది. క్యాంప్‌లో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నుంచి బస్సు కాన్వాయ్‌తో తొర్రూరు వైపు బయలుదేరారు. అయితే అన్నారం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలను కూడా పోలీసులు నిలిపివేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో సెక్షన్ 144 అమల్లో ఉందని, అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలాబలాలు సమానంగా ఉన్న చోట్ల పోటాపోటీ వాతావరణం నెలకొనడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు పార్టీల నేతలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు పలు ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు కారణమయ్యాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా రోజంతా తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.