TS: నేడు కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం
ఎల్బీ స్టేడియంలో సమావేశం... హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి;
తెలంగాణలో పార్టీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ LB స్టేడియంలో ఇవాళ జరగనున్న కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో కీలకమైన బూత్‌స్థాయి ఏజెంట్లకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ఎంపీ అభ్యర్ధుల గెలుపునకు యువజన కాంగ్రెస్ గట్టిగా పని చేయాలని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ దిశానిర్దేశం చేశారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్... తెలంగాణలో కనీసం 12 స్థానాలకు తగ్గకుండా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో సమీక్షలు చేసిన CM రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ బలాబలాలు, ఇతర పార్టీలు ఎక్కడెక్కడ పోటీనిస్తాయో ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిన పార్టీ... బలమైన నాయకుల కోసం వేట కొనసాగిస్తోంది. అందుబాటులో ఉన్న నాయకులతోపాటు ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన నేతలు పార్టీలో చేరేట్లుంటే... ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అధికార పార్టీగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయగలిగితే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని... ఓటర్లు పార్టీకి అనుకూలంగా మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.
ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి వంటి లోక్‌సభ నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించే దిశగా కార్యచరణ సిద్ధం చేసింది. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ ఇప్పటికే మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో సమావేశమై పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 36వేల బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ నాయకులతో ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాసు మున్సి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జిలు హాజరవుతారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేలా యువజన కాంగ్రెస్ గట్టిగా పని చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మున్షీతోపాటు సీడబ్ల్యుసీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ నాసర్, PCC కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీ తదితరులు పాల్గొన్నారు.