KTR: సింగరేణిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్... రెండు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేశారని ఆగ్రహం;

Update: 2025-03-16 03:30 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతోందని.. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అక్షర సత్యమని తేలిపోయిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసి, ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలను కూడా ప్రైవేటుకు కట్టబెట్టడం, ముంచుకొస్తున్న ముప్పుకు మరో ప్రమాద హెచ్చరిక అని పేర్కొన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన తొలితరం ప్రభుత్వరంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసి నీరుగార్చే కుతంత్రాలు కార్మికుల హక్కులకు మరణశాసనాలే అనే నిజం గ్రహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

సింగరేణి మన మూలస్తంభం

లాభాల పంట పండించి దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో మూలస్తంభంలా నిలిచినందుకు సింగరేణి సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్.. ప్రైవేటైజేషనేనా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జంగ్ సైరన్ మోగిస్తామని కేటీఆర్ అన్నారు. కార్మికుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చవిచూపిస్తామన్నారు.

రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌పై మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్థిక పరిస్థితి మాకెందుకు తెలియదు.. హామీలన్నీ అమలు చేస్తాం అన్నారు. సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం అని ప్రగల్భాలు పలికారు. 15 నెలల పాలనలో ఊదు గాలింది లేదు.. పీరు లేసింది లేదు. సగటున నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున రూ. లక్ష 50 వేల కోట్లు అప్పు తెచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకుంది’ అని ట్వీట్ చేశారు.

కేటీఆర్ నిరాహార దీక్షపై చామల సెటైర్లు

మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా.. కేటీఆర్ నిరాహార దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దళిత నాయకత్వంపై కేటీఆర్ ఆలోచనా విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమం మొదలు పెట్టినప్పుడు దళితుడు తెలంగాణ మొదటి సీఎం అని, అధికారంలోకి రాగానే కేసీఆర్ సీఎం అయ్యారని విమర్శించారు.

Tags:    

Similar News