KTR: కుల గణన.. ఓ చిత్తు కాగితం: కేటీఆర్

బీసీ కుల గణన సర్వే మళ్లీ చేపట్టాలి... సీఎం క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్;

Update: 2025-02-09 09:45 GMT

బీసీ కుల గణనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన సర్వే తప్పుల తడకగా ఉందని.. మళ్లీ రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సర్వే చేస్తే తాము కూడా పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, బీసీ కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టాల్సిన చర్యలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వం బీసీ జనాభాను ఐదున్నర శాతం తక్కువగా చూపిందని... కుల గణన నివేదిక చిత్తు కాగితంతో సమానమని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ బీసీల గొంతు కోసేలా వ్యవహరించిందని మండిపడ్డారు. శాస్త్రీయంగా మళ్లీ బీసీ కులగణన రీ సర్వే చేయాలని అన్నారు. బీసీ కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదన్న కేటీఆర్.. వారి పట్ల ప్రభుత్వం చిన్నచూపు ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్. ఎస్ ప్రవీణ్‌పై ప్రశంసల వర్షం

మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధి గురించి... భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్ కుమార్ ఆలోచనలు.. తన ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని కేటీఆర్‌ కొనియాడారు.

కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్

ఢిల్లీ ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్‌కి చాలా ఆనందం కలిగిస్తున్నట్టు ఉందని విమర్శించారు. కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారన్నారని ఆరోపించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఎక్కడికి పోయిందని మంత్రి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News