HCU:హెచ్‌సీయూలో కుప్పకూలిన భవనం

ఒక్కసారిగా కూలిన నిర్మాణంలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ... నలుగురికి తీవ్ర గాయాలు;

Update: 2025-02-28 02:30 GMT

 హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఒక్క సారిగా కుప్పకూలింది. బిల్డింగ్ సాయంకాలం కుప్పకూలడం... ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాసిరకం పనుల వల్లే భవనం కూలిపోయినట్లు భావిస్తున్నారు. హెచ్‌సీయూలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవసరాలకు సరిపోకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నిధులు విడుదల కావడంతో కాంట్రాక్టర్ కు పని అప్పగించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మొదటి ఫ్లోర్ సెంట్రింగ్ వేస్తున్న సమయంలో నే కుప్పకూలింది. అప్పటికే సెంట్రింగ్ పైన ఐరన్ రాడ్లు అమర్చారు. శ్లాబ్ పోయడానికి ఏర్పాట్లు చేసిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం కుప్పకూలిన విషయం గురించి తెలియగాన పోలీసులు, రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సెంట్రల్ వర్శిటీ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి.. అవినీతి చేయడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


ఉద్రిక్త పరిస్థితులు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న పరిపాలన భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే పోలీసులు, యూనివర్సిటీ అధికారులు స్పందించి, అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బాద్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో యూనివర్సిటీ వద్ద తోపులాట, వాగ్వాదం జరిగింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.

ఎన్నో ప్రశ్నలు

నిర్మాణంలో ఉన్న భవనం అకస్మాత్తుగా కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. భవనం నిర్మాణ నాణ్యత సరిగా లేకపోవడమే కారణమా? లేదా నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడమే దీనికి కారణమా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News