TG: బ్యాంకు ముందే కుటుంబం ఆత్మహత్యాయత్నం

బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం;

Update: 2025-03-16 03:00 GMT

బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఓ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్‌కు చెందిన చెల్లుపూరు హేమ్‌కుమార్‌, అనంద్‌కుమార్‌ సోదరులు. వీరు వ్యాపారం కోసం కాజీపేటలోని యూనియన్‌ బ్యాంక్‌లో 2017లో రూ.కోటి 20 లక్షలు రుణం తీసుకున్నారు. చెల్లింపు విషయంలో ఆలస్యం కావడంతో బ్యాంకు అధికారులు తనఖా ఉన్న ఇంటిని విక్రయించారు. కొనుగోలుదారుడికి అప్పగించే క్రమంలో రుణగ్రహీతలు సహకరించకపోవడంతో అధికారులు పోలీస్‌ బందోబస్తుతో తనఖా ఉన్న భవనం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న హేమ్‌కుమార్‌, ఆనంద్‌కుమార్‌ కుటుంబసభ్యులతో చేరుకొని తమ ఆస్తిని తమకుకాకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్‌ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నంచేశారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు (60)తో పాటు తన అల్లుడు ప్రశాంత్‌ (32), హేమ్‌కుమార్‌ కోడలు తేజస్వి(35)కి మంటలు అంటుకొని తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి, బాధితులను వెంకటరమణ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. తేజస్వి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆనంద్‌కుమార్‌కు 35 శాతం గాయాలు కాగా హేమకుమార్, ప్రశాంత్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.

అసలు ఏమైందంటే..

కిస్తీలు కట్టే విషయంలో వివాదం తలెత్తడంతో బ్యాంకు అధికారులు, వస్త్ర దుకాణం యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం అడ్వొకేట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా.. బ్యాంకుకు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. శనివారం అడ్వొకేట్ కమిషన్, బ్యాంకు అధికారులు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఉదయమే వేలం పాటలో ఒకరు ఈ భవనాన్ని దక్కించుకున్నారు. అయితే, బ్యాంకు వద్దకు చేరుకున్న సదరు వస్త్ర దుకాణం యజమానులు, వారి కుటుంబసభ్యులు.. నోటీసులు ఇవ్వకుండా తమ భవనాన్ని వేలంలో విక్రయించడం సరికాదని పేర్కొన్నారు. కనీసం 10 రోజులు గడువు కావాలని అడిగినప్పటికీ పట్టించుకోలేదని, కావాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భవనం చేజారుతుందనే ఆందోళనతో బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నారు.

Tags:    

Similar News