CBN: తెలంగాణలో ఏపీ కూటమి ఫార్మూలా..?
వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు..!;
తెలంగాణలో మరోసారి టీడీపీ జెండా ఎగురవేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారా? ఆంధ్రప్రదేశ్‌లో విజయాన్ని చవిచూసిన చంద్రబాబు, అదే ఫార్మూలాతో తెలంగాణ రాజకీయాల్లో అమలుపర్చేందుకు సిద్ధమయ్యారా? బీజేపీ, జనసేనతో కూటమిగా ఎన్నికల్లోకి దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? త్వరలోనే అసెంబ్లీ సమరంలో ఈ కూటమి తుపానుగా మారే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ స్థిరమైన నాయకత్వం లేక, పార్టీ బలహీనపడింది. అయినా, కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీకి మద్దతు ఉంది. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీకి ఉన్న పట్టుపై చంద్రబాబు మరలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేసి పరిమిత విజయాలే సాధించినా, ఇప్పుడు మళ్లీ కూటమి ద్వారా స్థిరమైన ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, బీజేపీ వాస్తవికంగా తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పార్టీ. ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పలు విజయాలు సాధించడం, నగర పాలక సంస్థల్లో దూకుడు పెంచడం ఇందుకు నిదర్శనాలు. అటు జనసేనకు తెలంగాణలో స్వతంత్ర స్థాయి పెద్దగా లేకపోయినా, పవన్ కళ్యాణ్ ప్రభావం గల ప్రాంతాల్లో మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల కలయిక ద్వారా ఓటు బ్యాంకులో మార్పులు తేల్చే అవకాశం ఉన్నదన్నది రాజకీయ విశ్లేషణ.
బనకచర్లనే కీలకం
ఇక్కడే కీలకంగా నిలిచేది బనకచర్ల ప్రాజెక్టు అంశం. ఈ ప్రాజెక్టుపై బీజేపీ నెమ్మదిగా స్పందించడాన్ని విశ్లేషకులు కూటమి రాజకీయాల కంటెక్స్‌లో చూడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రాజెక్టుపై గట్టిగా విమర్శలు చేస్తున్నప్పటికీ బీజేపీ నిష్క్రియంగా వ్యవహరించడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. కేంద్రం నుంచి కూటమిపై పచ్చజెండా వచ్చినట్టేనా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ కూటమి ఏర్పడితే ప్రధానంగా ప్రభావితం అయ్యేది ఎవరు? కాంగ్రెస్ పుంజుకుంటున్న పార్టీగా గత ఎన్నికల తర్వాత కనిపిస్తున్నప్పటికీ, కొత్తగా ఏర్పడే కూటమి వలన దీని ఓటు బ్యాంకు చీలిపోతుందా అన్నది పరిశీలించాల్సిన అంశం. అలాగే, బీఆర్ఎస్ కూడా గత ప్రభుత్వ కాలపు వ్యతిరేకతలు ఇంకా ప్రజల మదిలో ఉండగానే మరోసారి ఎన్నికల బరిలోకి దిగకతప్పదు. ఈ కూటమి వచ్చిందంటే, బీఆర్ఎస్‌కు ప్రత్యర్థులుగా ఉండే మిగతా ఓట్లు సమష్టిగా కేంద్రీకృతం కావచ్చు. మొత్తానికి చెప్పాలంటే.. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీడీపీ పునరాగమనానికి చంద్రబాబు పూనుకుంటున్నారు. కానీ, ఇది సరైన దిశేనా? కూటమి రాజకీయాలే ప్రత్యామ్నాయంగా నిలవగలవా? లేక అది కేవలం ఓటు శాతం చీల్చే వ్యూహంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతానికి తెరపైనే ఉన్నాయి. కానీ రాష్ట్రంలో మరోసారి పొత్తుల రాజకీయం వేగంగా పుంజుకుంటోందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.