Yadadri Temple : సీఎం కేసీఆర్ పిలుపు... యాదాద్రీశునికి బంగారు కానుకలు వెల్లువ..!
Yadadri Temple :ఆలయ విమాన గోపురాన్ని బంగారంతో తాపడం చేయిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తమ శక్తి మేర పసిడి కానుకలు పంపిస్తున్నారు.;
Yadadri : యాదాద్రీశునికి బంగారు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ విమాన గోపురాన్ని బంగారంతో తాపడం చేయిద్దామని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా తమ శక్తి మేర పసిడి కానుకలు పంపిస్తున్నారు. నిజానికి యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయడానికి కనీసం 120 కిలోల బంగారం అవసరం అవుతుంది. ఇందుకోసం 60 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.
ప్రభుత్వం ఈ మొత్తం బంగారాన్ని కొనేందుకు సిద్ధమైనప్పటికీ.. భక్తులు కూడా భాగస్వామ్యం అయితే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజల నుంచి కానుకలు స్వీకరిస్తున్నారు. గోపురం కోసం బంగారం కావాలని పిలుపునివ్వడం ఆలస్యం ఇప్పటికే కిలోల కొద్దీ బంగారం వచ్చి చేరింది. మరికొందరు బంగారానికి సమానంగా డబ్బును విరాళంగా ప్రకటిస్తున్నారు.
మొదటిరోజు 22 కిలోల బంగారం, రెండోరోజు 11 కిలోల బంగారం విరాళంగా వచ్చింది. ప్రణీత్ గ్రూప్ 2 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చింది. జలవిహార్ పక్షాన ఒక కిలో బంగారాన్ని అందజేస్తామని వ్యాపారవేత్త రామరాజు ప్రకటించారు. మేఘా సంస్థ 6 కేజీల బంగారం, చెన్నూరు ప్రజల పక్షాన బాల్క సుమన్ కిలో బంగారం, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ 2 కిలోల బంగారం ప్రకటించారు.
మొదటిరోజున సీఎం కేసీఆర్ కుటుంబం 1.16 కిలోల బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోలు, మంత్రి మల్లారెడ్డి 2 కిలోలు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 2 కిలోలు, హరీష్‌రావు కిలో బంగారం, చినజీయర్ పీఠం ఒక కిలో, కావేరీ సీడ్స్ కేజీ బంగారం, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కడపకు చెందిన వ్యాపారవేత్త జయమ్మ సైతం కిలో బంగారాన్ని కానుకగా సమర్పించింది.
యాదాద్రిని తిరుమల మాదిరిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రతి అంశంపైనా దృష్టిపెట్టింది తెలంగాణ సర్కార్. అందుకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ పనులు దాదాపుగా ముగింపు దశకు రావడంతో.. మూలవిరాట్ దర్శనానికి ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చి 28న సుదర్శన యాగం తరువాత యాదాద్రిలో దర్శనాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.