ATTACK:అర్చకుడు రంగరాజన్ పై దాడి.. ఆరుగురు అరెస్ట్
ముక్త కంఠంతో ఖండించిన అన్ని పార్టీలు.. చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్;
చిలుకురు బాలాజీ ఆలయ అర్చుకులు రంగరాజన్ పై దాడిని.. అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్వయంగా రంగరాజన్ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్.. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. ‘ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారు. 2022లో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ‘రామరాజ్యం’ను స్థాపించాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడు. రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పాడు’ అని డీసీపీ చెప్పారు.
రంగరాజన్‌కు సీఎం రేవంత్ ఫోన్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడిని ఖండించిన కిషన్ రెడ్డి
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రంగరాజన్ ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ట్వీట్ చేశారు.
రంగరాజన్‌పై దాడి చేసింది ఇతడే
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తి వీరరాఘవరెడ్డికి సంబంధించిన ఫోటోను పోలీసులు తాజాగా విడుదల చేశారు. కాగా.. 2022లో ఆయన రామరాజ్యం స్థాపించారు.