తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం చరణ్‌రెడ్డితో జరుగింది. రంగారెడ్డి జిల్లాలోని పాటిగడ్డ లార్ధుమాత చర్చిలో వివాహ వేడుకను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు చరణ్‌రెడ్డితో ప్రత్యూష పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకుల్లో భాగంగా నిన్న మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లి కూతురిని చేశారు. వధువుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు.
ప్రత్యూష పెళ్లి వేడుకలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యదేవరాజన్ పర్యవేక్షించారు. వివాహాన్ని వైభవంగా జరిపించారు మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు. కన్నతండ్రి, సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూషను సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఆమె వసతి, విద్య, ఇతర బాగోగులను పర్యవేక్షించారు.
ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకునేందుకు కారణాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష... తన తల్లి 2003లో చనిపోయేముందు తన పేర ఉన్న ఆస్తిని ప్రత్యూషకు రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరిపోవడంతో.. ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే వత్తాసు పలికి హింసించాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. మరణం అంచున ఉన్న ప్రత్యూషను సవతితల్లి, తండ్రి చెరనుంచి విముక్తి కల్పించి వైద్యం చేయించారు.
విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ఆమె కోరిక మేరకు నర్సింగ్ కోర్సును పూర్తి చేయించారు. ప్రస్తుతం ప్రత్యూష ఓ ప్రైవేట్ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు ఇవాళ రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో వివాహం జరిపించారు.