KCR : ఇవాళ ఢిల్లీకి కేసీఆర్.. వడ్ల కొనుగోళ్లపై కేంద్రంతో తాడోపేడో
KCR : ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికే సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.;
KCR (tv5news.in)
KCR : ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికే సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనిపై చర్చిచేందుకు తెలంగాణ భవన్‌లో ఈ ఉదయం 11.30కు టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు.. ఇలా మొత్తం 315 మందికి ఆహ్వానాలు అందాయి.
ధాన్యం కొనుగోలు చేయాలని.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమించాలని పార్టీ నేతలకు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పంజాబ్ తరహాలో 100 శాతం కేంద్ర ప్రభుత్వంకొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. అలాగే ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తేచ్చేలా పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
ఈ సమావేశం అనంతరం మంత్రుల బృందంతో కలిసి సీఎం కేసీఆర్.. ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీలో ఎంపీలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.
తెలంగాణపై దృష్టిపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రం హోం మంత్రి అమిత్‌షా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు వరి పోరు పేరిట కేసీఆర్ ఢిల్లీ వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.