దళితబంధు పథకం పై రేపు సీఎం కేసీఆర్‌ సమీక్ష.. !

ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయడంపై సన్నాహక సమావేశాన్ని సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు.

Update: 2021-09-12 16:30 GMT

దళితబంధును హుజూరాబాద్‌ నియోజకవర్గం, వాసాలమర్రిలో ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. మరో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో అమలు చేయడంపై సన్నాహక సమావేశాన్ని సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగే ఈ సమావేశంలో.... దళిత బంద్‌పై రివ్యూ చేయనున్నారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తిలోని తిర్మలగిరి, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ నాలుగు మండలాల్లో దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌తో పాటు పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. దళిత బంద్‌ పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యచరణ కోసం.... ఈ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటారు. ఇక ఈ సమావేశానికి ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఆయా జిల్లాల జడ్పీ ఛైర్మన్లు, కలెక్టర్లు, సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా హాజరవుతారు.

Tags:    

Similar News