REVANTH: దేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయం

ప్రజల సలహాలతో ముందుకు సాగాలి.. కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ కీలక సూచనలు;

Update: 2025-05-02 03:30 GMT

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయం కాంగ్రెస్ సాధించిన విజయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA)ఆమోదం తెలపటంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కులగణనకు అవసరమైన సహాయసహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కులగణన కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వేల కిలోమీటర్లు పాదయాత్రను రేవంత్ గుర్తు చేశారు. ఇందుకు రాహుల్‌గాంధీకి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలన్నారు. దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతూ ఢిల్లీలో ధర్నా చేపట్టాయన్నారు. కులగణనపై తెలంగాణకు అవగాహన ఉందని.. అందుకు తెలంగాణను రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన కోసం కేంద్రమంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి అందులో సీనియర్‌ అధికారులను నియమించాలని.. అన్ని రాష్ట్రాలకు పంపించాలని కోరారు. కేంద్రం కులగణనను ఎప్పుడూ మొదలు పెడతారో, ఎప్పటికి పూర్తి చేస్తారో మోదీ చెప్పాలన్నారు. ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదని.. కులగణన విధివిధానాలు వెల్లడించాలన్నారు.

నామమాత్రంగా చేయటం వల్ల ఉపయోగం లేదు

తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు.. కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారని.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని... అందుకే కేంద్రం ఏర్పాటు చేసిన ఈ కమిటీ... ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారి సూచనలు స్వీకరించాలన్నారు. జన, కులగణన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయ్యాలన్నారు. సర్వేను కులంకుషంగా పూర్తి చేసి నివేదికను ఆ సమాచారాన్ని వెల్లడించాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి కోరారు. మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని నియమించి దేశవ్యాప్తంగా అధ్యయనానికి శ్రీకారం చుట్టాలన్నారు. తూతూ మంత్రంగా కుల గణన చేస్తే జిరాక్స్ తీసినట్టు ఉంటుందని దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణలో చేసిన సర్వేలో 8వేల పేజీల్లో 57 ప్రశ్నలు రూపొందించి వివరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా చేపట్టిన కులగణనను మోడల్‌ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి కులగణన చేశామన్నారు కులగణన చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్‌లో పెట్టి.. కుల గణనలో పాల్గొనని వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చామన్నారు. ఇదంతా ఎప్పటికప్పుడు మంత్రుల కమిటీ పర్యవేక్షించిందన్నారు..

Tags:    

Similar News