Metro Rail: ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన
హైదరాబాద్‌లో ప్రతి గల్లీ అభివృద్ధి మా ప్రభుత్వం బాధ్యతేనన్న సీఎం రేవంత్;
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ఫరూక్‌నగర్ బస్టాండ్ వద్ద 5.5 కిలోమీటర్ల మేర మెట్రోరైలు మార్గం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైబ్రంట్ తెలంగాణ-2050లో భాగంగారాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించిన సీఎం అందులో భాగంగా పాతబస్తీ అభివృద్ధికి కూడా కృషిచేస్తామన్నారు. చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి మారుస్తామన్న సీఎం ఆ ప్రాంతంలో కేజీ టు పీజీ విద్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు.గత ప్రభుత్వం ధనికుల కోసం ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం రూపొందించిందన్న సీఎంపేదలకు పనికొచ్చేలా తాము మార్పులు చేశామని వివరించారు.
చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేస్తామన్న సీఎం అక్బరుద్దీన్ సూచనల మేరకు పాతబస్తీలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. 2034 వరకు..పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న ఆయన హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తామని చెప్పారు. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగల నేత అని చెప్పిన అసదుద్దీన్ ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఆయన ప్రశాంతంగా ఐదేళ్లు పనిచేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు. దారుల్‌షిఫా నుంచి ఆలియాబాద్ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. పాతబస్తీ కారిడార్‌లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్ వద్ద 120 అడుగులు, మిగిలిన ప్రాంతాల్లో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. మెట్రోరైల్ రెండో దశలో నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానించనున్నారు. చాంద్రాయణగుట్ట వద్ద మేజర్ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ను నిర్మించే అవకాశం ఉంది.