REVANTH: తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీనే
బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా.... రోహిత్ వేముల కేసు పునర్విచారణ చేస్తామన్న రేవంత్;
పదేళ్లపాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీనే అని CM రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం కొత్తగూడెంలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిన బీజేపీకి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని..... సూచించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారని.. CM గుర్తుచేశారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో... కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఈ నెల 9లోగా ఒక్క రైతుకైనా రైతు భరోసా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానన్న సీఎం.. అమలుచేశాక అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్‌కు సవాల్ చేశారు.
పునర్విచారణ చేస్తాం
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016 ఏడాది ఆత్మహత్య చేసుకున్న.. రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి..... న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో.... వర్సిటీ వీసీ, పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ కోర్టు విచారణను ముగించిన వేళ రోహిత్ తల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని చేసిన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్‌రెడ్డి.... పునర్విచారణపై ఇప్పటికే డీజీపీ ప్రకటన చేసిన అంశాన్ని గుర్తుచేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారు. అందుకే 2014, 2019, 2023లో భారాసను దూరం పెట్టారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు.. ముందుచూపు ఎక్కువ. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది భాజపానే. ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందకు కాంగ్రెస్‌ను గెలిపించాలి. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.