TS: రికార్డుల ప్రభుత్వం మాది: రేవంత్ రెడ్డి

భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలిచ్చారా అని నడ్డాకు సవాల్‌;

Update: 2024-12-08 04:15 GMT

కాంగ్రెస్‌ది రికార్డుల ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే వ్యవసాయ రుణాల మాఫీ, పంట బోనస్, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల్లో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం మహిళా సంక్షేమ పథకాలు, కుల గణన, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అవలంబించే పర్యావరణ కేంద్రీకృత పట్టణాభివృద్ధి విధానాలపైనా చర్చలు జరుపుతున్నాం’ అని ట్వీట్ చేశారు.

తెలంగాణ ఏర్పడింది నాలుగు కోట్ల ప్రజల కోసమా, కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురి కోసమా.. అనేది భారాస నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. గెలిస్తే ఉప్పొంగిపోయి.. ఓడిపోతే కుంగిపోయి ఫాంహౌస్‌కు పరిమితం కావడం కేసీఆర్‌ అనుభవానికి తగిన పని కాదని హితవు పలికారు. ‘ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. 1200 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి రుణం తీర్చుకోవద్దా?’ అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ మొదటి ఏడాదిలో 55 వేల ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వమే లేదని స్పష్టంచేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం.. నల్గొండలోని గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగసభలో ప్రసంగించారు. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే కేసీఆర్‌ మాట్లాడాల్సింది పోయి.. ఒక గాలిబ్యాచ్‌ను తమపై వదిలారని ఆరోపించారు. తాము ఏం చేసినా వద్దనడం తప్ప వాళ్లకు ఇంకొకటి తెలియడంలేదని ఆక్షేపించారు. హైదరాబాద్‌ వచ్చిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపైనా సీఎం మండిపడ్డారు. ‘భాజపా అధ్యక్షుడు నడ్డా గారూ.. మా అడ్డాకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడకండి. మీ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఒక్క ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేశారా? ఇన్ని ఉద్యోగాలిచ్చినట్లు నిరూపిస్తే దిల్లీ నడిబజారులో తలవంచుకుని మీకు క్షమాపణ చెబుతా. లేకపోతే మీరు మా రాష్ట్రాన్ని అభినందించండి చాలు. కేటీఆర్, హరీశ్‌రావు అంటున్న మాటలనే ఈటల కాపీ కొడుతున్నారు’ అంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారు. 

Tags:    

Similar News