TG: త్వరలో 15 వేల అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ
మంత్రి సీతక్క కీలక ప్రకటన
తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అంగన్వాడీ సేవలను ఆధునీకరించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను ప్రారంభించడమే కాకుండా అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇస్తూ, త్వరలోనే సుమారు 15 వేల పోస్టులను నింపనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాలంటే సిబ్బంది బలోపేతం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. టీచర్లు, ఆయాల వేతనాల పెంపు అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కార్యక్రమంలో భాగంగా 1,368 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు అందజేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 వేల మంది సిబ్బందికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు.
ఈ స్మార్ట్ఫోన్ల ద్వారా సేవల నాణ్యతను పెంచడం, డేటా నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యమని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అంగన్వాడీ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని పోషకలోప రహితంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా చిన్నపిల్లలకు ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కౌమార బాలికలు ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక పోషకాహార పథకాలను అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇప్పటికే వేల సంఖ్యలో భవనాలకు ఆమోదం లభించిందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.