Stray dogs problems: వీధికుక్కల సమస్యపై తక్షణ చర్యలకు సీఏం ఆదేశం
జవహర్‌నగర్‌లో చిన్నారి మృతి ఘటన కలచివేసిందన్న రేవంత్‌రెడ్డి;
హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్‌లో వీధికుక్కలు దాడి చేసి బాలుడిని చంపేసిన దుర్ఘటనపై సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. ‘‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. వీధికుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్, టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయండి. వీధికుక్కలు ఇలా దాడులకు పాల్పడడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ వేయండి. వాటి నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించండి. అవి కరిస్తే తక్షణం చికిత్స అందించడానికి వీలుగా... రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి’’ అని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో వీధికుక్కల నియంత్రణ, రేబిస్ నిర్మూలనకు కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల హైదరాబాద్‌లో శునకాల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన ఘటనపై దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. చిన్నారుల ప్రాణాలను కాపాడుకోలేకపోవడం తీవ్ర అంశమని ఘాటుగా స్పందించింది. వాటి నియంత్రణకు కమిటీలు వేసి, వివరాలను సమర్పించాలని ఈ నెల 10న ఆదేశించడంతో ప్రభుత్వం స్పందించింది.
కమిటీల బాధ్యతలు...
వీధికుక్కలను జనావాసాలకు దూరంగా తరలించడం, వాటికి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేయడం, జంతు సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం కల్పించడం, రేబిస్ సోకిన వాటిని గుర్తించి టీకాలు, స్టెరిలైజేషన్ చేయించడం, శునకాల దాడికి గురవకుండా ప్రజలకు అవగాహన కల్పించడం, పెంపుడు కుక్కల యజమానులను అప్రమత్తం చేయడం, కుక్కకాటు కేసులను గుర్తించడం, ఫిర్యాదులపై సత్వరమే స్పందించడం వంటి బాధ్యతలు ఈ కమిటీలపై ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు