SHARMILA: జగన్ పాదయాత్ర అధికారం కోసమే: షర్మిల ఆరోపణ

జగన్‌కు అధికారం సూట్ కాలేదు... జగన్ నైజం బయటపడింది: షర్మిల

Update: 2026-01-30 05:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గురువారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, జగన్ రాజకీయ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంతోనే నైజం బయటపడింది "ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలన్న అబ్రహం లింకన్ మాటలు జగన్‌కు సరిగ్గా సరిపోతాయి. మనం జగన్‌కు అధికారం ఇచ్చి చూశాం.. అది ఆయనకు అస్సలు సూట్ కాలేదని అర్థమైంది" అని షర్మిల వ్యాఖ్యానించారు. జగన్‌లో స్వార్థం తగ్గి, ప్రజల పట్ల సేవ చేసే గుణం పెరిగే వరకు దేవుడు, ప్రజలు ఆయనను కరుణించరని హితవు పలికారు.

పాదయాత్ర అధికారం కోసమేనా?

2027లో జగన్ చేపట్టనున్న పాదయాత్రపై స్పందిస్తూ.. "మేం ఇప్పుడు ఉపాధి హామీ కూలీల సమస్యలపై పోరాడుతున్నాం. కానీ జగన్ కేవలం 2029లో అధికారం దక్కించుకోవడానికే ఇప్పుడే యాత్ర ప్రకటన చేశారు తప్ప, ప్రజల కోసం కాదు" అని విమర్శించారు. మద్యపాన నిషేధం: నిషేధం పేరుతో నకిలీ మద్యంతో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. పర్యావరణం: రుషికొండను బోడిగుండు చేశారని మండిపడ్డారు. అందుబాటు: సీఎం హోదాలో కనీసం సొంత పార్టీ నేతలకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. జగన్ తన ప్రవర్తన, నైజం మార్చుకోకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని షర్మిల స్పష్టం చేశారు. జగన్ గారు ఇప్పటికైనా గతాన్ని నెమరువేసుకుని, ప్రజల పట్ల తనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలని, లేదంటే కాలమే ఆయనకు తగిన బుద్ధి చెబుతుందని షర్మిల హెచ్చరించారు. అధికారం అంటే అహంకారం కాదు, అది ప్రజలు ఇచ్చిన బాధ్యత అని గుర్తుంచుకోవాలని ఆమె ఈ సందర్భంగా హితవు పలికారు. మొత్తానికి, వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ఈ అన్నాచెల్లెళ్ల సవాల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News