ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది.ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు మేడారం క్షేత్ర స్థాయి సందర్శనకు సీఎం వెళుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం.. గద్దెల దర్శనం... బంగారం (బెల్లం) సమర్పణ.. జంపన్న వాగులో స్నానాలచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.