REVANTH: ఎవరి మీద మీ సమరం
ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు... అప్పుకు పోతే దొంగల లెక్క చూస్తారని వ్యాఖ్య.. ప్రజలపై యుద్ధం చేస్తారా నిలదీత;
"మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?" అంటూ ఆర్టీసీ కార్మికులను రేవంత్ సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై మండిపడ్డారు. తనను కోసినా సరే.. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "సమరం కాదు.. సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిందాం. రాజకీయ నాయకుల్లో ఉద్యోగులు పావుగా మారొద్దు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా?" అని ప్రశ్నించారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని... బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని రేవంత్ అన్నారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు.స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారమని వెల్లడించారు. ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
గత పాలకులు చేసింది కాదా..?
రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలోని వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయి లేనని రేవంత్ గుర్తు చేశారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమరమని అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. ఎవరిపై సమరం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అంటూ కార్మిక జేఏసీ నేతలను నిలదీశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామన్నారు. మనం సమరం చేయడానికి ఇక్కడ లేమని.. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు.
కేసీఆర్ పై ఆగ్రహం
ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్‌లో హాయిగా పాడుకున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనమని పేర్కొన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దని సూచించారు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదామని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.