REVANTH: రాహుల్ వ్యాఖ్యలు కదిలించాయి: రేవంత్
రోహిత్ వేముల చట్టం అమలుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న రేవంత్;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘జపాన్‌లోని చారిత్రాత్మక నగరమైన హిరోషిమాలో మహాత్మాగాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన స్థలంలో మీ ఉత్తరం చదివాను. ప్రేరణ దాయకమైన మీ మాటలు నన్ను ఎంతగానో కదిలించాయి. మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తాం’ అని ట్వీట్ చేశారు. "రోహిత్ వేముల చట్టం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించడం, విద్యార్థుల హక్కులను కాపాడటం మా ప్రభుత్వ లక్ష్యం. ఈ చట్టం కోసం అవసరమైన చట్టపరమైన, విధానపరమైన చర్యలను వేగవంతం చేస్తాం," అని తెలిపారు. ఈ చట్టం ద్వారా యూనివర్శిటీల్లో విద్యార్థులకు వేధింపుల నుంచి రక్షణ, కుల వివక్షను ఎదుర్కొనేందుకు కఠిన నిబంధనలు, సమగ్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
రాహుల్ ఏమన్నారంటే...?
విద్యాసంస్థల్లో కులవివక్షను నియంత్రించేందుకు ‘రోహిత్ వేముల’ పేరిట చట్టాన్ని రూపొందించి... అమలు చేయాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ... తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... లేఖ రాశారు. విద్యాసంస్థల్లో అందరినీ సమానంగా చూడాలనే లక్ష్యంతో రోహిత్ వేముల పేరు మీద చట్టం తేవాలని సూచించారు. విద్యావ్యవస్థలో నేటికీ బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రికి సూచించారు. నేటికి మన విద్యావ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటని రాహుల్ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేడ్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డా ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తారని నమ్ముతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇటువంటి హత్యలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ అన్నారు.