REVANTH: అధికారులు ఏసీ గదులు వీడట్లేదు

సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... వారిని చూసి నేర్చుకోవాలని హితవు;

Update: 2025-02-17 02:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే పోలీసులు స్టేషన్లలోనే ఉండి, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. అలాగే, ఐఏఎస్ అధికారులు ఫీల్డ్‌లో పని చేయకుండా ఏసీ గదుల్లోనే ఉంటున్నారని, వారికి "ఏసీ జబ్బు పట్టినట్లుంది" అంటూ వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్‌ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్‌ ఆఫ్‌ ఏ సివిల్‌ సర్వెంట్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గోపాలకృష్ణ గారి అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషమని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ . ఏదైనా కొనవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ను కొనలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వారిని చూసి నేర్చుకోవాలి

అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని... కానీ ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్... దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని రేవంత్ అన్నారు. పారదర్శక విధానాన్ని అవలంభించాలని సూచించారు.

నిబద్దత కలిగిన అధికారులకే అందలం

‘‘నిబద్ధత కలిగినటువంటి అధికారులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాలకులు ఎన్ని పాలసీలు చేపట్టినా.. అమలు చేసేది మాత్రం అధికారులే. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన అధికారులను ప్రజలూ గుర్తుంచుకుంటారు. మనకున్న జ్ఞానం, అధికారం పేదలకు ఉపయోగపడాలి’’ అని సీఎం అన్నారు. 

Tags:    

Similar News