గతంలో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా దివంగత వైఎస్ పథకాలను మెచ్చుకొని, కొనసాగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కానీ, అలా నిజాలు చెప్పే ధైర్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టు కేసులు, ఎలక్షన్ కోడ్ వల్ల అభ్యర్థులకు అపాయింట్‌మెంట్స్ ఇవ్వలేకపోయింది. ఆ ఉద్యోగాలు తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకుంటోంది. బీఆర్ఎస్ పాత్రను ఒప్పుకునే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు’ అని హరీశ్ అన్నారు.
సీతారామ ప్రాజెక్టు చేపట్టి మొదలు పెట్టింది కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చాటుకుంటోందని మండిపడ్డారు. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాజెక్టని, ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని ఈ ప్రాజెక్టు ఆయన సంకల్పం చేశారన్నారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాము సీతారామ ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 8 నెలల్లో ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రతి ఆనవాలు లేకుండా బీరాలు పలికారని, కానీ ప్రతి పని ఆయన చేస్తే మీరు ప్రారంభిస్తున్నారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ నేతలు అనేక అడ్డంకులు సృష్టించారని, అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టును నిర్మించామని హరీష్ రావు పేర్కొన్నారు.