Congress Munugode: మునుగోడులో వెనకబడిన కాంగ్రెస్‌.. అభ్యర్థి ప్రకటన వాయిదా..

Congress Munugode: మునుగోడుపై టీఆర్ఎస్, బీజేపీ దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్ వెనకబడింది. ఇప్పటి వరకు అభ్యర్థినే ప్రకటించలేదు

Update: 2022-08-30 06:15 GMT

Congress Munugode: మునుగోడుపై టీఆర్ఎస్, బీజేపీ దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం వెనకబడింది. ఇప్పటి వరకు అభ్యర్థినే ప్రకటించలేదు. ఆశావహులతో మీటింగ్ పెట్టి, వారి అభిప్రాయాలు తీసుకుని, వారిపై సర్వేలు కూడా చేయించింది తెలంగాణ పీసీసీ. వారిలో ది బెస్ట్‌ ఎవరనే పేర్లను ప్రత్యేకంగా సీల్డ్ కవర్‌లో పెట్టి అధిష్టానానికి పంపించారు. ఢిల్లీకి చేరడమైతే చేరింది గాని.. ఇప్పటి వరకు అట్నుంచి తిరుగు టపా వచ్చినట్లు లేదు. నిజానికి కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్‌ ప్రకారం నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థి ప్రకటన జరగాలి. కాని, దీన్ని సెప్టెంబర్‌ మొదటివారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మునుగోడు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో.. ప్రచారంలోనూ దూకుడుగా వెళ్లలేకపోతోంది కాంగ్రెస్‌. అటు ఎవరికి టికెట్ వస్తుందో తెలియక మునుగోడు క్యాడర్‌ కూడా పెద్దగా ప్రచారంలోకి వెళ్లడం లేదు. మొత్తంగా మునుగోడులో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్​నేత పోటీపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ నలుగురి బలాబలాలపై కాంగ్రెస్​రాజకీయ వ్యూహకర్త సునీల్​కనుగోలు బృందం సర్వే చేసింది.

ఆ నివేదికలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్​ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీకి నివేదిక పంపించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని కూడా ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. మొన్న ఢిల్లీలో ప్రియాంకగాంధీతో జరిగిన సమావేశంలోనూ మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్.. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లతో సమావేశమయ్యారు.

పీసీసీ చీఫ్‌ రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర్​రెడ్డి.. నలుగురు ఆశావహులతో సమావేశమయ్యారు. ఎవరికి టికెట్ వచ్చినా అందరు కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. అసమ్మతి రేగకుండా జాగ్రత్తపడుతున్నప్పటికీ.. అభ్యర్థి ప్రకటన మరీ ఆలస్యం అవుతుండడంతో.. ఆ ఎఫెక్ట్ ప్రచారంపైనా కనిపిస్తోంది. మునుగోడులో విజయం సాధించాలని శ్రీవారిని వేడుకున్నానని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

తిరుమల వెళ్లిన కోమటిరెడ్డి దంపతులు.. మునుగోడు ప్రజలే తన దేవుళ్లని, వాళ్ల తీర్పును శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను.. జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా కేసీఆర్ ఆరాచక పాలన అంతమొందించేలా ప్రజలు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News