CONGRESS: పాదయాత్రలో కలిసి నడుస్తారా..?
జులై 31 నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర... కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం....కాంగ్రెస్ నేతలు ఏకమవుతారా అన్న ప్రశ్న... నేటి నుంచి టీపీసీసీ చీఫ్ జనహిత యాత్ర;
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ జులై 31 నుండి తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో సంబంధాలను బలపరచడం, ప్రభుత్వ విధానాలను ప్రచారం చేయడం కోసం అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వారం రోజుల షెడ్యూల్ ను ఖరారు చేశారు. రోజుకో నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో 8 నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ సైతం సిద్ధమైంది. ప్రజలతో మమేకం కావడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో శ్రమదానం కూడా చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన జైభీమ్, జై బాపూ, జై సంవిధాన్ పై నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మీనాక్షి భావిస్తున్నరని తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఆమె ప్లాన్ చేస్తున్నారు.
పరిగి నుంచే ప్రారంభం
ఈ నెల 31 నుంచి ఏడు రోజుల పాటు ఆమె జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం. తొలుత పరిగి సెగ్మెంట్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలి దపాలో పరిగి, అందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట సెగ్మెంట్లలో పర్యటిస్తారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పాదయాత్రతో పాటు రాత్రి బస చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాలను కవర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తొలి విడత
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పరిగి, అందోల్, ఖానాపూర్, వర్దన్నపేట, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో తొలి విడతగా పాదయాత్రలు, శ్రమదానం చేపట్టనున్నారు. అదే సమయంలో ఆ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలను వివరించున్నారు. ఈ కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహంతో పాటు, జిల్లా పార్టీ యాక్టివ్ అవడం, పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలకు సైతం చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.